Music Trigger: అకస్మాత్తుగా రేడియోలోనో, మొబైల్‌లోనో ఏదైనా ఒక పాత పాట మీ చెవిన పడినప్పుడు, క్షణాల్లో మీరు కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన అనుభూతి ఎప్పుడైనా కలిగిందా? స్కూల్ రోజుల్లోని ఆ మధుర జ్ఞాపకాలు, స్నేహితులతో గడిపిన ఆహ్లాదకరమైన సాయంత్రాలు లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తితో జరిగిన మొదటి పరిచయం… ఇవన్నీ ఒక సినిమా రీల్ లాగా మీ కళ్ల ముందు కదలాడుతుంటాయి.
ఆ క్షణంలో సమయం అక్కడే ఆగిపోయిందా, గడిచిన కాలం మళ్లీ కళ్ల ముందుకు వచ్చేసిందా అన్నట్లు అనిపిస్తుంది. కానీ, పాత జ్ఞాపకాలను మళ్లీ సజీవంగా మార్చేంత శక్తి సంగీతానికి ఎక్కడి నుండి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి, ఇదంతా మన మెదడు ఆడే ఒక ఆసక్తికరమైన ఆట. దీని వెనుక ఉన్న న్యూరోసైన్స్ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మెదడుకు, సంగీతానికి ఉన్న బలమైన బంధం
మనం ఏదైనా ఒక పాటను వింటున్నప్పుడు, మన మెదడు కేవలం ఆ శబ్దాన్ని మాత్రమే వినదు. ఆ సమయంలో మెదడులోని పలు భాగాలు ఒకేసారి యాక్టివ్ అవుతాయి. న్యూరోసైన్స్ ప్రకారం.. సంగీతం వినగానే మన మెదడులో ఒక విధమైన కదలిక మొదలవుతుంది. మూడు ముఖ్యమైన భాగాలు కలిసి పనిచేస్తాయి:
-
ఆడిటరీ కార్టెక్స్ (Auditory Cortex): మన మెదడులోని ఈ భాగం పాట ట్యూన్, శృతి ఇంకా లయను (ధ్వనిని) ప్రాసెస్ చేస్తుంది.
-
హిప్పోకాంపస్ (Hippocampus): మెదడులోని ఈ భాగం మన జ్ఞాపకాలను భద్రపరచడానికి, అలాగే వాటిని మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
-
అమిగ్డాలా (Amygdala): ఇది మన భావోద్వేగాలను (Emotions) పూర్తిగా కంట్రోల్ చేస్తుంది.
పాట వింటున్నప్పుడు జ్ఞాపకాలను, భావోద్వేగాలను నియంత్రించే ఈ విభాగాలు ఒకేసారి కలిసి పనిచేయడం వల్ల, ఆ పాట నేరుగా మన జీవితంలోని ఒక ప్రత్యేకమైన సంఘటనతో లేదా ఒక బలమైన అనుభూతితో ముడిపడిపోతుంది.
జీవిత జ్ఞాపకాల సౌండ్‌ట్రాక్ (Nostalgia)
మన జీవితంలోని ప్రతి పెద్ద మార్పు లేదా అందమైన మలుపు వెనుక ఏదో ఒక సంగీతం ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. పెళ్లి సందడి కావచ్చు, స్నేహితులతో కలిసి వెళ్లిన లాంగ్ రోడ్ ట్రిప్, కాలేజ్ ఫేర్‌వెల్ లేదా ఫస్ట్ బ్రేకప్.. ఈ అనుభవాలన్నింటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక పాట ప్లే అవుతూనే ఉంటుంది.
మన మెదడు ఈ అనుభవాలను కేవలం ఫొటోల రూపంలో మాత్రమే రికార్డ్ చేయదు. ఆ సమయంలో చుట్టుపక్కల వినిపిస్తున్న మ్యూజిక్‌ను కూడా ఆ జ్ఞాపకానికి ఒక ‘ట్యాగ్’ లాగా తగిలించేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత, అదే ట్యూన్ మళ్లీ మన చెవిన పడినప్పుడు, అది మెదడుకు ఒక తాళంచెవిలా పనిచేస్తుంది. దాంతో ఆ జ్ఞాపకాల తలుపులు తెరుచుకుని, నాటి సంతోషం, బాధ లేదా థ్రిల్ మళ్లీ మనకు అనుభవంలోకి వస్తాయి. దీనినే మనం ‘నోస్టాల్జియా’ (గత స్మృతులు) అంటాము.
మతిమరుపు వ్యాధిని (Alzheimer’s) కూడా ఓడించే సంగీతం!
సంగీతం నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన లయ, పునరావృతం (రిపీట్ అవ్వడం) ఉంటాయి. అందుకే మన మెదడు దాన్ని చాలా సులభంగా గుర్తుంచుకోగలుగుతుంది. పోయిన వారం మీరు ఏం తిన్నారో మీకు గుర్తుండకపోవచ్చు కానీ, 10 ఏళ్ల క్రితం విన్న ఒక పాత పాట మాత్రం ఈ రోజుకీ నోటికి వచ్చేస్తుంది.
సంగీతానికి ఉన్న ఈ పవర్ ఎంత బలమైనదంటే మెడికల్ సైన్స్ కూడా దీనికి సలాం కొడుతోంది. అల్జీమర్స్ మరియు డిమెన్షియా (తీవ్రమైన మతిమరుపు) తో బాధపడుతున్న రోగులపై చేసిన పరిశోధనల ప్రకారం.. తమ సొంత మనుషుల పేర్లను, ముఖాలను కూడా మర్చిపోయిన రోగులు, వారి యవ్వన కాలంలో తమకు నచ్చిన పాత పాటను వినగానే ముఖంలో చిరునవ్వు చిందిస్తున్నారు లేదా ఆ పాటను గునుగుతున్నారు. మతిమరుపు వ్యాధి ప్రభావం పడకుండా మెదడులో ఇంకా సురక్షితంగా మిగిలి ఉన్న కొన్ని భాగాలను సంగీతం మళ్లీ నిద్రలేపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
