Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో శ్రామిక వర్గానికి భారీ ఊరటనిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, కనీస వేతనాల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ.. జూన్ 1 నుంచి రాష్ట్రంలో నూతన కనీస వేతనాలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగా కార్మికులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
కార్మికుల విభజన.. కనీస వేతనం రూ.16 వేలకు పెంపు
కార్మికులకు న్యాయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం గతంలో ఉన్న రెండు జోన్ల విధానాన్ని మార్చి, ఇప్పుడు మూడు జోన్లుగా విభజించింది. అలాగే కార్మికులను నాలుగు విభాగాలుగా వర్గీకరించి వేతనాలను ఖరారు చేసింది.
-
జోన్ 1: మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు. (వీరి కనీస వేతనాన్ని రూ.16 వేలకు పెంచారు).
-
జోన్ 2: మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమల కార్మికులు.
-
జోన్ 3: గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలలో పనిచేసే కార్మికులు.
ఈ పెంచిన కనీస వేతనాలను యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే లేబర్ కమిషన్ ద్వారా కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
యువత ఏఐ (AI) పై దృష్టి పెట్టాలి.. స్కిల్స్ ఉంటేనే కొలువులు!
కేవలం డిగ్రీలు, చదువులతో ఉద్యోగాలు రావట్లేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక నైపుణ్యాలను (Technical Skills) పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉద్యోగం, ఉపాధి రాని చదువులతో ప్రయోజనం లేదు. యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రూ. లక్ష జీతం వస్తుందో లేదో తెలియదు కానీ, సాంకేతిక నైపుణ్యం ఉంటే మాత్రం రూ.2 లక్షల జీతం సులభంగా వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల ఉత్పాదక రంగానికి తెలంగాణ ప్రత్యమ్నాయంగా మారాలని ఆకాంక్షించారు. విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, గతంలో గల్ఫ్ వెళ్లేవారు ఏజెంట్ల చేతిలో మోసపోయేవారని గుర్తుచేశారు. గల్ఫ్ కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని, త్వరలోనే వారి కోసం ఒక బెస్ట్ ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాబోతున్నామని హామీ ఇచ్చారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్స్.. కేటీఆర్ ఒక మనిషేనా?: సీఎం తీవ్ర విమర్శలు
రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ (వ్యవస్థీకృత నేరాలు) చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు చట్టప్రకారం తనిఖీల్లో పట్టుకున్నారని, పోలీసులు చెప్పిన మాటలనే తాను నమ్ముతానని స్పష్టం చేశారు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే దాన్ని ‘లొంగుబాటు’ అంటూ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు జడ్జీలుగా మారి తీర్పులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
“కేటీఆర్ ఒక మనిషేనా? మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా? పోక్సో (POCSO) కేసులో బాధితుల ఫోటోలు, వివరాలను బయటపెట్టకూడదనే కనీస జ్ఞానం లేదా?” అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు, కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికినప్పుడు కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, ప్రభుత్వానికి, పోలీసులకు చట్టాలు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
