Chandrababu Naidu

Chandrababu Naidu: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి తాజాగా కుప్పం పర్యటనలో సందడి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లిన ఈ దంపతులు, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఆగి, తాజా తాటి ముంజలను రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.

తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు అనే ప్రాంతం వద్ద కల్లు గీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని సీఎం చంద్రబాబు గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి, భువనేశ్వరితో కలిసి అక్కడికి వెళ్లారు. కార్మికులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి.. వారి వృత్తి సమస్యలను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే రోడ్డు పక్కన నిలబడి ఎంతో ఇష్టంగా తాటి ముంజలను తిన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని పంచుకుంటూ.. “ఈ తాటి ముంజల్లో ఎలాంటి కల్తీ లేదు, కార్బైడ్ లేదు, పురుగు మందుల గోల అస్సలే లేదు. మా కుప్పం ప్రజల మనసుల్లాగే ఈ ముంజలు ఎంతో స్వచ్ఛంగా, చల్లగా ఉన్నాయి. వీటిని తింటుంటే ఎంతో హాయిగా అనిపించింది. మన గ్రామీణ ప్రాంతాల్లో దొరికే సహజ ఆహార పదార్థాలకు మించింది ఏదీ లేదు” అని కొనియాడారు.

సీఎం సతీమణి భువనేశ్వరి కూడా ఈ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. “తాజా తాటి ముంజలను రుచి చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వీటిని తింటుంటే మాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి” అంటూ ఆమె మురిసిపోయారు. ముఖ్యమంత్రి దంపతులు అంతటి హోదాలో ఉండి కూడా, సామాన్యులలా రోడ్డు పక్కన ఆగి ముంజలు తినడం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *