Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో పట్టపగలే ఒక దారుణ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో మంగళవారం ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే, ఆమె పనిచేసే చోటికే వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బహదూర్‌పురా కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన బంగి దేబోరా అనే మహిళ కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న ఒక స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా ఈమెకు, ఆమె భర్తకు మధ్య తీవ్రమైన కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత దేబోరా రోజులాగే కవాడిగూడలోని తన ఆఫీస్‌కు వచ్చేసింది.

అయితే, భార్యపై తీవ్ర కోపంతో రగిలిపోయిన భర్త, ఎలాగైనా ఆమెను అంతమొందించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఒక పదునైన కత్తిని వెంటబెట్టుకుని ఆమె పనిచేసే స్పా సెంటర్‌కు నేరుగా వెళ్లాడు. అక్కడ భార్యతో మళ్లీ వాదనకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఒక్కసారిగా రెచ్చిపోయి, తన తెచ్చిన కత్తితో దేబోరాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది.

హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి, నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మొదట మృతురాలి పేరు శ్వేత అని ప్రచారం జరిగినప్పటికీ, ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా ఆమె పేరు బంగి దేబోరా అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *