Vijay’s New Cabinet: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి విజయ్, తన మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న సభ్యుల తొలి జాబితాను ప్రకటించారు. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియమ్ లో విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటి నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారులు, వైద్యులు ఇంకా రాజకీయ వ్యూహకర్తల వరకు వైవిధ్యమైన వ్యక్తులకు చోటు దక్కడం విశేషం.
సినిమా గ్లామర్‌ను పక్కన పెట్టి ప్రజా సేవలో అడుగుపెట్టిన విజయ్, తన మంత్రివర్గ కూర్పులోనూ తనదైన ముద్ర వేశారు. కేవలం రాజకీయ అనుభవం మాత్రమే కాకుండా.. వృత్తిపరమైన నైపుణ్యం, యువతరం ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ తొలి జాబితాలో కేవలం తమిళగ వెట్రి కజగం (TVK) నాయకులకు మాత్రమే చోటు కల్పించారు.
1. ఎన్. ఆనంద్ (N. Anand): విజయ్ పార్టీని స్థాపించకముందే ఆయన ఫ్యాన్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆనంద్, టీవీకే పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ తొలి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. చెన్నైలోని టీ నగర్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి రాజా అన్బళగన్‌ను ఓడించి ఆయన విజయం సాధించారు.
2. ఆదవ్ అర్జున (Aadhav Arjuna): 6 అడుగుల 7 అంగుళాల పొడవుండే ఈ మాజీ జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఒక రాజకీయ వ్యూహకర్త ఇంకా క్రీడా నిర్వాహకుడు. గతంలో డీఎంకే విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2026 ఎన్నికల్లో చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయ్, ఆనంద్ తర్వాత పార్టీలో అత్యంత కీలకమైన పదవిలో (ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి) ఈయనే ఉన్నారు.
3. డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ (Dr. KG Arunraj): వృత్తిరీత్యా ఫిజిషియన్ మరియు మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్‌రాజ్, టీవీకే విధానాలు ఇంకా ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
4. ఎస్. కీర్తన (S. Keerthana): 29 ఏళ్ల యువ నటి మరియు శివకాశి ఎమ్మెల్యే అయిన కీర్తన, విజయ్ క్యాబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
5. డాక్టర్ టీకే ప్రభు (Dr. TK Prabhu): తమిళగ వెట్రి కజగం ప్రముఖ నాయకుడైన డాక్టర్ టీకే ప్రభు ఒక డెంటిస్ట్. ఈయన కారైకుడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
6. సెంగోట్టయన్ (Sengottaiyan): ఏఐఏడీఎంకేలో దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న అత్యంత సీనియర్ నాయకుడు సెంగోట్టయన్. గతేడాది ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన విజయ్‌తో చేతులు కలపడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.
7. పి. వెంకటరమణన్ (P. Venkataramanan): తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన టీవీకే కోశాధికారి మరియు వృత్తిరీత్యా న్యాయవాది. చెన్నైలోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన 2000 సంవత్సరం నుండి విజయ్‌కు వ్యక్తిగత మేనేజర్‌గా పనిచేస్తున్న అత్యంత నమ్మకస్తుడు.
8. నిర్మల్ కుమార్ (Nirmal Kumar): టీవీకే ఐటీ మరియు సోషల్ మీడియా విభాగం డిప్యూటీ జనరల్ సెక్రటరీ అయిన నిర్మల్ కుమార్, మదురైలోని తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
9. రాజమోహన్ ఆరుముగం (Rajmohan Arumugam): నటుడు, స్టాండప్ కమెడియన్ మరియు మోటివేషనల్ స్పీకర్ అయిన రాజమోహన్ ఆరుముగం చెన్నైలోని ఎగ్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి, ఇప్పుడు విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
