Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ వీసీకే (VCK) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మద్దతు లేఖను టీవీకే ప్రతినిధి ఆధవ్ అర్జునకు అందజేశారు. దీంతో విజయ్ బలం మ్యాజిక్ ఫిగర్ దాటి 118కి చేరుకుంది.
గత సోమవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. పూర్తి మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో విజయ్ బలం 116కు చేరినప్పటికీ, వీసీకే చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగింది. ఇప్పుడు వీసీకే కూడా మద్దతు తెలపడంతో విజయ్ మార్గం సుగమమైంది.
బలం నిరూపించుకున్న విజయ్, మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి మద్దతు లేఖను అందజేయనున్నారు. గవర్నర్ ఈ మద్దతుపై సంతృప్తి వ్యక్తం చేస్తే, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణమే ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ వార్తతో సంబరాల్లో మునిగిపోయారు.
మరోవైపు, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఈరోజు సాయంత్రమే కేరళ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మళ్లీ చేజారకముందే, ఈ రాత్రికే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఇన్ని మలుపుల మధ్య విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tamil Nadu | VCK extends unconditional support to TVK to form a government in the state.
With this, TVK now has the support of Congress, CPI, CPI(M) and VCK, taking its tally to 119, crossing the majority mark of 118. pic.twitter.com/iWK69ncqHq
— ANI (@ANI) May 9, 2026
