Revanth Reddy

Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Revanth Reddy: హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా  తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో పట్టణీకరణ వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ‘త్రీ లెవల్’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా అండర్ పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. కేవలం రోడ్లు వెడల్పు చేస్తే సరిపోదని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, నగరంలో ప్రధాన సమస్యగా మారిన పార్కింగ్ ఇబ్బందులను తొలగించడానికి మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సేవా రంగం కోసం, ఔటర్ రింగురోడ్డుకు – రీజినల్ రింగురోడ్డుకు మధ్య ఉన్న ప్రాంతాన్ని తయారీ రంగం కోసం కేటాయించారు. ఇక రీజినల్ రింగురోడ్డు అవతల ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయ రంగం కోసం అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో ఒక భారీ మాస్టర్ ప్లాన్‌ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *