Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన సినిమాను తలపిస్తున్నాయి. చెన్నై వేదికగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు పడుతోంది. ఇందులో భాగంగానే తమిళనాడుకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరికి బస ఏర్పాటు చేశారు. తమిళనాడులో సంక్షోభం సద్దుమణిగే వరకు వీరు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 118 మార్కుకు మరో 11 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఈ లోటును పూడ్చుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలతో విజయ్ చర్చలు జరిపారు. ఆ పార్టీలు మద్దతు ప్రకటించడంతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు విజయ్ లేఖలు సమర్పించారు.
అయితే, ఈ మద్దతు వ్యవహారంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు, అందుకు ఏర్పాట్లు కూడా శరవేగంగా జరిగాయి. కానీ, మద్దతు ఇస్తామన్న పార్టీల నుంచి అధికారిక లేఖలు అందడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా వీసీకే పార్టీ మద్దతుపై సందిగ్ధత నెలకొనడం, ఇతర పార్టీల వైఖరిలో మార్పు రావడంతో గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడటమే కాకుండా, తమిళ రాజకీయాల్లో గంటకో మలుపు చోటుచేసుకుంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. అందుకే తమ ఐదుగురు ఎమ్మెల్యేలను రక్షణగా హైదరాబాద్‌కు పంపింది. అటు చెన్నైలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో, తదుపరి ఏం జరగబోతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. విజయ్ సీఎం పీఠం ఎక్కుతారా? లేక ఈ సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
