TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళ స్టార్ హీరో, టీవీకే (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీని విజయ్ సాధించడంతో, రాష్ట్రంలో కొత్త పాలన మొదలుకాబోతోంది. చిన్న పార్టీలతో విజయ్ జరిపిన చర్చలు ఫలించడంతో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చాయి.
మద్దతు తెలిపిన పార్టీలు ఇవే..
ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సొంతంగా 108 సీట్లు గెలుచుకుంది. అయితే విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో టెక్నికల్‌గా ఆ సంఖ్య 107గా ఉంది. మెజార్టీ మార్కును అందుకోవడానికి మరికొన్ని సీట్లు అవసరమైన తరుణంలో.. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మరియు వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే కూటమి బలం ఇప్పుడు 118కి చేరింది. దీనితో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం విజయ్‌కు లభించినట్లయ్యింది.
గవర్నర్‌తో భేటీ:
మెజార్టీ బలం సమకూరడంతో, విజయ్ శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను సమర్పించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నారు. గవర్నర్‌తో సమావేశం ముగిసిన తర్వాత తనతో కలిసి నడిచిన మిత్రపక్షాల నేతలతో విజయ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
మంత్రి పదవుల పంపకం:
తమకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలని విజయ్ నిర్ణయించుకున్నారు. సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు, అలాగే సీపీఐ, సీపీఎం మరియు వీసీకే పార్టీలకు తలో ఒక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోతూ కొత్త తమిళనాడును నిర్మిస్తానని విజయ్ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.
ప్రజల్లో ఉత్సాహం:
వెండితెరపై ‘సర్కార్’ నడిపిన దళపతి విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి, ఒక కొత్త శక్తి అధికారంలోకి రావడం తమిళ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది.
