Heat Wave Alert: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. రోహిణి కార్తె రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే చాలు, బయటకు రావాలంటేనే జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. మంగళవారం (ఏప్రిల్ 28) నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను బద్దలుకొట్టడం ఎండ తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే హాట్ ప్లేస్‌గా నిలిచింది. వీటితో పాటు సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఏకంగా 48.8 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.
ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల సహా పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు వంటివి వెంట ఉంచుకోవాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అది ఎండల నుండి కొంత ఉపశమనం కలిగిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
