Uber Driver: ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ డబ్బులపైన ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క రూపాయి దొరికినా ఎవరికీ తెలియకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని తెలిపే సంఘటన ఒకటి జరిగింది. 6.5 లక్షల విలువ చేసే బంగారం దొరికినా వాటికి ఆశపడకుండా పోలీసులకు అప్పగించిన ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు, నగదు బహుమతితో అతడిని సత్కరించారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్ హిరేమఠ్ అనే మహిళ నర్సింగ్ లో ఉంటున్నారు. ఆమె బిర్లా మందిర్ దర్శనం కోసం ఏప్రిల్ 23న ఉబర్ ఆటో (TG11T1076) బుక్ చేసుకొని అందులో వెళ్లింది. ఆటో దిగే సమయంలో హడావిడిగా ఉన్న ఆమె, దిగేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ని మర్చిపోయింది. కొంత సమయం గడిచిన తర్వాత గానీ ఆమెకు తెలియలేదు. ఆటోలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినట్టు గుర్తొచ్చింది. అందులో 6.5 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ. 3 వేల 500 ఉన్నాయి. వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించింది.
సీఐ సీతయ్య ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు కె. వినయ్ కుమార్, మదన్ మోహన్ లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ కనుక్కొని అతనికి ఫోన్ చేయగా స్పందించిన డ్రైవర్ కె. నగేష్, ఆటోలోనే హ్యాండ్ బ్యాగ్ ఉందని చెప్పారు.
పోలీస్ స్టేషన్ చేరుకొని హ్యాండ్ బ్యాగ్ ని, అందులో ఉన్న బంగారాన్ని, డబ్బులను మహిళకు అందించారు. తన నిజాయితీకి మెచ్చుకున్న పోలీసులు కొంత నగదుని బహుమతిగా అందించారు. సమయానికి పోలీసులు స్పందించడంతోనే తన హ్యాండ్ బ్యాగ్, అందులోని నగలు దొరికాయి అని బాధితురాలు చెప్పారు.
