Crime News

Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!

Crime News: ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన ఒక మేధావి.. పెళ్లి కాబోయే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక అర్థాంతరంగా తనువు చాలించింది. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న ఎమ్మెస్సీ (M.Sc) గ్రాడ్యుయేట్ రెహానా (26), తన నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుందన్న ఆందోళనతో కడపలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విజయం ముంగిట విషాదం

కడప పటేల్ రోడ్డుకు చెందిన రెహానా చదువులో ఎంతో చురుకైనది. ఇటీవలే ఆమె తన విద్యా ప్రతిభకు గాను బంగారు పతకాన్ని అందుకుంది. కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలోనే, కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ ఉద్యోగి షాజహాన్‌తో ఆమెకు సంబంధం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో వైభవంగా జరిగింది.

నిశ్చితార్థం తర్వాత మొదలైన నరకం

పెళ్లి పీటలెక్కాల్సిన ఆ నిశ్చితార్థమే రెహానా పాలిట శాపంగా మారింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న షాజహాన్, నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి ఫోన్లలో ఆమెను మానసిక క్షోభకు గురిచేయడం మొదలుపెట్టాడు.

“నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు” అంటూ ముక్కుసూటిగా చెప్పేవాడు. తనకు గతంలో నలుగురు ప్రియురాళ్ళు ఉన్నారని, ఈ పెళ్లి బలవంతంగా చేసుకుంటున్నానని పదేపదే వేధించేవాడు.పెళ్లికి ముందే ఒక యువతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడంతో రెహానా తీవ్ర మనస్తాపానికి గురైంది.

12 పేజీల లేఖలో ఆవేదన

సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెహానా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె రాసిన 12 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తను ఎదుర్కొన్న నరకాన్ని, షాజహాన్ తనను ఎంతగా మానసిక హింసకు గురిచేశాడో కన్నీటితో వివరించినట్లు సమాచారం.

పోలీసుల దర్యాప్తు – షాజహాన్‌పై కేసు

రెహానా తండ్రి ఫిర్యాదు మేరకు చిన్నచౌకు పోలీసులు షాజహాన్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిశ్చితార్థం చేసుకుని ఒక యువతి ప్రాణాలతో ఆడుకున్న సదరు యువకుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *