Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: కేసీఆర్ సభలో ‘బీజేపీ’ ప్రస్తావన ఏది?.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కవిత ఘాటు విమర్శలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సభల పరంపర కొనసాగుతుండగా, అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల తీరుపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగిత్యాల వేదికగా జరిగిన సభల్లో ఇరు పార్టీలు ప్రజలకు కేవలం కథలు చెప్పాయని, అసలు సమస్యలను గాలికొదిలేశాయని ఆమె విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు కీలక అంశాలపై తన గొంతు వినిపించారు.

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న పోరాటానికి కవిత పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందుల్లో ఉంటే, ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మాత్రం సభలు నిర్వహించడంలో బిజీగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని ఆమె డిమాండ్ చేశారు.

ఉట్టి కథలు.. పిట్ట కథలు!

నిన్నటి సభల తీరును ఎండగడుతూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం (బీఆర్ఎస్) ఉట్టి కథలు చెబితే.. ప్రభుత్వం (కాంగ్రెస్) పిట్ట కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశాయి. బీఆర్ఎస్ సభలో బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్లు, ఉద్యమకారుల విస్మరణ

మహిళా రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ మౌనం వహించడాన్ని కవిత తప్పుబట్టారు.

  • మహిళా రిజర్వేషన్: సభలో మహిళా రిజర్వేషన్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమని, ఆడబిడ్డలకు కేసీఆర్ ఎటువంటి భరోసా ఇవ్వలేకపోయారని విమర్శించారు.

  • ఉద్యమకారుల విస్మరణ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోకపోవడం వారిని అవమానించడమేనని అన్నారు.

  • ప్రజలపై నెపం: బీఆర్ఎస్ ఓటమిని ప్రజల ఓటమిగా చిత్రీకరించడం సిగ్గుచేటని, తమకు ఓటు వేయలేదని ప్రజలను తప్పుబట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

జీవన్‌రెడ్డి ఒక ‘తెలంగాణ వ్యతిరేకి’

ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత జీవన్‌రెడ్డిపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్‌రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కవిత విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *