Fire Accident

Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్‌లో భారీగా ఆస్తి నష్టం

Fire Accident: సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని టిఎన్జీవో కాలనీలోని ఒక అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా ఆస్తి నష్టం భారీగానే జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అస్వస్థతకు గురైన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం.. అపార్ట్మెంట్ సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న 15 బైక్‌లకు మంటలు అంటుకోవడంతో అపార్ట్మెంట్ అంతటా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న వారు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వీరిలో ఇద్దరు స్పృహ కోల్పోవడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు పై అంతస్తులకు వ్యాపించకుండా నీటిని చిమ్మి అదుపు చేశారు. అపార్ట్మెంట్‌లో చిక్కుకున్న వారిని నిచ్చెనల సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టాన్ని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *