Jersey: కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, మరికొన్ని సినిమా చూస్తున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి థియేటర్ నుండి బయటికి రాగానే సినిమాలో అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి.. థియేటర్ లో చూస్తున్నప్పుడు బాగుంటాయి, మనతో ఇంటికి వస్తాయి. కొన్ని నెలల తర్వాత కూడా ఏదో సంబంధం లేని సినిమా చూస్తున్నప్పుడు కూడా మధ్యలో ఈ సినిమా గుర్తొస్తుంది. అలాంటి సినిమాలలో ముందుండే సినిమా జెర్సీ. రిలీజ్ అయి 7 ఏళ్లు అవుతున్నా కుదిరినప్పుడల్లా జెర్సీ గురించి, అందులో ఉండే ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటారు.
నాని హీరోగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పెద్దగా వసూళ్లు సాధించకపోయినా, అందరి ఫేవరేట్ లిస్ట్ లోకి చేరిపోయింది. కొడుకుకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తండ్రి.. తనను తాను కనుక్కోవడంతో పాటు కొడుకుకి ఇచ్చిన మాట నెరవేర్చడంతో ముగుస్తుంది ఈ కథ.
కొడుకు పుట్టినరోజుకి జెర్సీని గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చిన తండ్రి.. కానీ కొనడానికి డబ్బులు లేక దానికోసం ప్రయత్నించే సమయంలో అతనికి అతనే తక్కువగా అనిపిస్తాడు. అందరూ చిన్నచూపు చూసినా తన కొడుకు మాత్రం తనని అలా చూడొద్దని, చనిపోతానని తెలిసినా మళ్ళీ క్రికెట్ ఆడడం మొదలు పెడతాడు.
కానీ భార్య వద్దంటుంది, అప్పటివరకు ఎంకరేజ్ చేసిన కోచ్ కూడా మళ్ళీ క్రికెట్ లోకి వెళ్తా అనగానే మాట్లాడటం మానేస్తాడు. ఇలా భార్య, కోచ్ మాట్లాడటం మానేసినా క్రికెట్ ఆడడం మాత్రం వదలడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఆటంకాలు వస్తున్నా అన్నిటినీ ఎదుర్కొని చివరికి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవుతాడు. కానీ ఆడటానికి మాత్రం నాని ఉండడు.. చనిపోతాడు. కానీ కొడుకుకి ఇచ్చిన మాట మాత్రం నెరవేరుస్తాడు. ఇండియన్ టీమ్ జెర్సీ చివరికి కొడుకుకి చేరుకుంటుంది.
ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా, సత్యరాజ్ కోచ్ గా నటించారు. సినిమా గురించి చెప్పుకుంటూ పోతే చెప్పడానికి చాలానే విషయాలు ఉంటాయి.
