Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ హఠాత్తుగా పేలిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటన ఎయిర్పోర్ట్ లోపలే జరగడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు ఒక ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. విమానం ఎక్కే ముందు నిబంధనల ప్రకారం సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, సదరు ప్రయాణికుడి బ్యాగులోని ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బ్యాగు నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ఒకవేళ ఇదే ఫోన్ విమానం గాల్లో ఉన్నప్పుడు పేలి ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని ఎయిర్పోర్ట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫోన్ బ్యాటరీ పేలడానికి గల కారణం షార్ట్ సర్క్యూటా లేక ఇతర సాంకేతిక లోపాలా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని విమానాశ్రయ భద్రతా అధికారులు ఆదేశించారు.
