Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సహకరించండి.. మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy: మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, అలాగే డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ఆ లేఖలో కోరారు.

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి రెండూ వేర్వేరు అంశాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా కోటాను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా అందరూ మద్దతు ఇస్తున్నారని, కాబట్టి దీనిని ఆలస్యం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు కేటాయించిన కోటాను వెంటనే అమల్లోకి తెస్తే దేశమంతా స్వాగతిస్తుందని ప్రధానికి సూచించారు. రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్ల అనవసర జాప్యం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పెంపు చేపడితే.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు, అలాగే చిన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కొన్ని రాజకీయ పార్టీలకు తాత్కాలికంగా ప్రయోజనం కలగవచ్చు కానీ, దీర్ఘకాలంలో దేశ సమగ్రతకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే కాకుండా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించాలని కోరారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, జాతీయ స్థాయిలో ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *