Sun Colour: చిన్నప్పటి నుండి మనం సూర్యుడి బొమ్మ గీసినప్పుడల్లా పసుపు లేదా ఆరెంజ్ రంగు వేస్తుంటాం. కానీ మీకు తెలుసా? సూర్యుడు నిజానికి పసుపు రంగులో ఉండడు! అంతరిక్షం నుండి చూస్తే సూర్యుడు అచ్చమైన తెలుపు (White) రంగులో కనిపిస్తాడు. మరి భూమి మీద నుండి చూస్తే పసుపు రంగులో ఎందుకు కనిపిస్తాడో ఇపుడు తెలుసుకోండి.
సూర్యుడి నిజమైన రంగు
సూర్యుడి ఉపరితల(Surface) ఉష్ణోగ్రత(Temperature) దాదాపు 5,500°C నుండి 6000°C వరకు ఉంటుంది. ఈ వేడి వల్ల సూర్యుడు ఒకే రంగు కాకుండా, ఇంద్రధనుస్సులో ఉండే అన్ని రంగుల మిశ్రమాన్ని (VIBGYOR) విడుదల చేస్తాడు. మన కళ్ళు ఈ రంగులన్నింటినీ కలిపి చూసినప్పుడు అది మనకు తెల్లని కాంతిలా కనిపిస్తుంది. అందుకే స్పేస్ స్టేషన్ నుండి చూసే ఆస్ట్రోనాట్స్‌కు సూర్యుడు ఒక తెల్లని బంతిలా కనిపిస్తాడు.
భూమి మీద పసుపు రంగులోకి ఎలా మారుతాడు?
సూర్యరశ్మి భూమిని చేరుకోవాలంటే మన వాతావరణం (Atmosphere) గుండా ప్రయాణించాలి. మన గాలిలో ఉండే నత్రజని(Nitrogen), ఆక్సిజన్ అణువులు(Oxygen Molecules) సూర్యకాంతిని అడ్డుకుంటాయి. దీన్నే రేలీ స్కాటరింగ్ (Rayleigh Scattering) అంటారు.
- సూర్యుడి నుండి వచ్చే నీలం, వైలెట్ వంటి తక్కువ వేవ్‌లెంగ్త్ ఉన్న రంగులు వాతావరణంలో ఎక్కువగా చెల్లాచెదురు అవుతాయి. దీనివల్ల ఆకాశం మనకి నీలంగా కనిపిస్తుంది.
- ఇలా నీలం రంగు విడిపోయాక, మిగిలిన ఎరుపు, పసుపు రంగులు మన కళ్ళకు చేరుతాయి. అందుకే సూర్యుడు మనకు పసుపు రంగులో కనిపిస్తాడు.
3మధ్యాహ్నం మరియు సాయంత్రం మధ్య తేడా ఏమిటి?
- మధ్యాహ్నం వేళ: సూర్యుడు మనకు నేరుగా తలపై ఉంటాడు. కాంతి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి, సూర్యుడు తెల్లగా లేదా లేత పసుపు రంగులో కనిపిస్తాడు.
- సూర్యాస్తమయం సమయంలో: సూర్యుడు క్షితిజ సమాంతరంగా (Horizon) ఉన్నప్పుడు, కాంతి చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడు నీలం రంగు పూర్తిగా చెల్లాచెదురై, కేవలం ఎరుపు మరియు నారింజ రంగులు మాత్రమే మన దాకా వస్తాయి. అందుకే అప్పుడు సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
ఒక చిన్న నిజం (Myth-Bust)
కొందరు సూర్యుడు పచ్చ (Green) రంగులో ఉంటాడని చెప్తారు. ఎందుకంటే సూర్యుడు విడుదల చేసే కాంతిలో పచ్చ రంగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ పైన చెప్పుకున్నట్లు అన్ని రంగులు కలిసినప్పుడు మన మెదడు దాన్ని ‘వైట్’ గానే గుర్తిస్తుంది. కాబట్టి సూర్యుడు ‘గ్రీన్’ కాదు, ‘వైట్’! ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు.
