Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత, రైతు పక్షపాతిగా పేరున్న జీవన్ రెడ్డి.. శుక్రవారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నేతలు ఒకే చోట కలవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. తెలంగాణకు కష్టం వస్తున్న ఈ సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. అందుకే భగవంతుడే నన్ను మీ దగ్గరకు పంపాడు” అంటూ కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారు. జీవన్ రెడ్డి మాటలకు చలించిపోయిన కేసీఆర్.. వెంటనే ఆయనను దగ్గరకు తీసుకొని అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయనకు దుశ్శాలువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ నివాసానికి వచ్చారు. అందరూ కలిసి కాసేపు రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నాక, కేసీఆర్ స్వయంగా వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం కొనసాగిన జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్‌ను ‘అన్నా’ అని పిలుస్తూ జీవన్ రెడ్డి చూపించిన అభిమానం చూస్తుంటే, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది.
