April Fool’s Day

April Fool’s Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. ఈ ‘తమాషా’ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

April Fool’s Day: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ రాగానే అందరిలో ఒకటే సందడి. స్నేహితులను, తోటి ఉద్యోగులను, కుటుంబ సభ్యులను ఏదో ఒక అబద్ధం చెప్పి ఆటపట్టించాలని అందరూ చూస్తుంటారు. అవతలి వారు మనం చెప్పిన మాట నమ్మి బుక్కైపోతే.. ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ గట్టిగా అరిచి నవ్వుకుంటాం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ రోజున చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే, అసలు ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సంప్రదాయం ఎక్కడ మొదలైంది? ఏప్రిల్ 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు? అనే విషయంపై ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా, చరిత్రలో కొన్ని ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.

సాధారణంగా ఏప్రిల్ 1 అంటే కొత్త ఆర్థిక సంవత్సరం  ప్రారంభం అవుతుంది. కానీ ప్రపంచమంతా దీనిని ‘ఫూల్స్ డే’గా పిలుచుకుంటుంది. దీని వెనుక ఉన్న ప్రధానమైన కథ 1582వ సంవత్సరానికి సంబంధించింది. అప్పట్లో ఫ్రాన్స్ దేశం ‘జూలియన్ క్యాలెండర్’ నుంచి ‘గ్రెగోరియన్ క్యాలెండర్’కు మారింది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమయ్యేది. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది జనవరి 1కి మారింది. ఈ మార్పును గమనించని కొందరు ప్రజలు పాత పద్ధతిలోనే ఏప్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. అలా పాత కాలం పద్ధతిని పాటిస్తూ ఏప్రిల్ 1న పండుగ చేసుకునే వారిని మిగతా వారు ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డేగా మారిపోయింది.

మరొక ప్రచారంలో ఉన్న కథ 1381వ సంవత్సరానికి చెందినది. ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II మరియు బొహేమియా రాణి అన్నే తమ నిశ్చితార్థాన్ని మార్చి 32, 1381న జరుపుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ కాలంలో రాజు మాట అంటే వేదం కాబట్టి, ప్రజలందరూ ఆ తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ పండగలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, తీరా మార్చి 31 గడిచిన తర్వాత అందరికీ ఒక విషయం అర్థమైంది. అసలు క్యాలెండర్‌లో మార్చి 32 అనే తేదీయే ఉండదు. అంటే రాజు తమను ఆటపట్టించారని ప్రజలు గ్రహించారు. అప్పటి నుంచి మార్చి 31 తర్వాత వచ్చే ఏప్రిల్ 1వ తేదీని అందరినీ ఫూల్స్ చేసే రోజుగా జరుపుకోవడం ఆచారంగా మారింది.

ఏది ఏమైనా, ఒకరిని బాధపెట్టకుండా కేవలం సరదా కోసం, నవ్వులాట కోసం ఈ రోజును జరుపుకోవడం మంచిది. మన బాల్యంలో కూడా ఎవరినో ఒకరిని ఇలా ఫూల్ చేసిన జ్ఞాపకాలు మనందరికీ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఈ కథల వెనుక ఉన్న నిజానిజాలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 1 మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక సరదా పండుగలా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *