Miyapur

Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో, ఒక వ్యక్తి తన తండ్రితో కలిసి వచ్చి ఓ మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్ కీపింగ్ పని చేస్తూ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. గతంలో భర్తను కోల్పోయిన ఆమె, గత నెల 20న ప్రసాద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

అయితే, నూకరత్నం పని చేసే చోటే వంట మనిషిగా పని చేస్తున్న ఆలీషా అనే వ్యక్తి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు చెప్పకుండా ప్రసాద్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఆమెతో గొడవకు దిగాడు. ఈ నెల 19న ఆలీషా తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. తనతో పాటు రావాలని ఆమెను వేధించాడు. దానికి ఆమె నిరాకరించడంతో, ఆలీషా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు ఆలీషా మరియు అతడి తండ్రి లాలూను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నూకరత్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వ్యక్తిగత కక్షలతో ఇలాంటి దాడులకు పాల్పడటం స్థానికంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *