Karimnagar: కరీంనగర్ నగరంలో ఒకే కుటుంబంలో జరిగిన వరుస ఆత్మహత్యలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్, తన భార్య దివ్య మరణాన్ని జీర్ణించుకోలేక శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు తీసుకోవడం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.. నాలుగు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత చంద్రశేఖర్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. భార్య అంత్యక్రియల సమయంలో బంధువులు, గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆమె మరణానికి ఆయనే కారణమని ఆరోపించడంతో ఆయన మనసు మరింత గాయపడింది. ఆ సమయంలో అత్తమామలు అడ్డుపడి చంద్రశేఖర్‌ను కాపాడినప్పటికీ, ఆయన మాత్రం లోలోపల తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు.
భార్య మరణం తర్వాత ఐదో రోజు కార్యక్రమం కోసం చంద్రశేఖర్ తన అత్తగారి ఊరైన ఇల్లందుకుంట మండలం సీతంపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ అందరూ పనిలో ఉండగా, ఆయన ఒక గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా, చంద్రశేఖర్ ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆయనను జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒకే వారంలో ఇద్దరు వ్యక్తులు ఇలా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
