Telangana Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ భారీ బడ్జెట్‌ను ఆయన సుదీర్ఘంగా చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో తిరిగి సోమవారం ఉదయం సభ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్య మరియు సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాని అన్ని రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. “మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం” అని చెబుతూ ప్రభుత్వ బాధ్యతను ఆయన గుర్తు చేశారు.
మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఆరు గ్యారంటీల అమలుకు పెద్దపీట వేయడమే కాకుండా, సామాన్యులకు ఉపయోగపడేలా ఐదు కొత్త పథకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై సభ్యుల మధ్య చర్చ జరగనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధుల కేటాయింపులపై విపక్షాలు ఇచ్చే సూచనలు, అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.
