Telangana Budget: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ను రూపొందించింది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యంగా ‘ఆరు గ్యారంటీల’ అమలు కోసం ఏకంగా రూ. 50,713 కోట్లను కేటాయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భారీ నిధులను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. సామాన్యుడి సొంతింటి కల నుంచి విద్యార్థుల చదువుల వరకు ప్రతి అంశానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు.
పథకాల వారీగా కేటాయింపులను గమనిస్తే, రైతు భరోసా పథకానికి అత్యధికంగా రూ. 18,000 కోట్లు కేటాయించారు. పేదలకు ఆసరాగా నిలిచే చేయూత పథకానికి రూ. 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5,500 కోట్లు కేటాయించారు. మహిళా సంక్షేమం కోసం ఉద్దేశించిన మహాలక్ష్మి పథకానికి రూ. 4,305 కోట్లు, సన్న వడ్ల బోనస్ కోసం రూ. 3,500 కోట్లు, మరియు గృహ జ్యోతి పథకం (200 యూనిట్ల ఉచిత విద్యుత్) కింద రూ. 2,080 కోట్లు కేటాయించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ. 1,143 కోట్లు, సిలిండర్ సబ్సిడీకి రూ. 723 కోట్లు, కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,683 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
విద్య మరియు మౌలిక సదుపాయాల రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపన కోసం రూ. 5,000 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం రూ. 4,343 కోట్లు, మరియు డైట్ ఛార్జీల కోసం రూ. 2,170 కోట్లు కేటాయించారు. చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 1,000 కోట్లు ఇవ్వడం విశేషం. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కోసం రూ. 1,056 కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ. 1,500 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఈ బడ్జెట్ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకం చేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
