Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుక్రవారం ఉదయం చుక్కలు కనిపించాయి. నగరంలో అత్యంత వేగవంతమైన ప్రయాణ సాధనంగా పేరున్న మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల బ్లూ లైన్ మార్గంలో అంటే అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే దారిలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ వద్ద రాయదుర్గం వైపు వెళ్తున్న రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 12 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది.
ఈ సాంకేతిక లోపం వల్ల కేవలం ఒక వైపే కాకుండా, అమీర్‌పేట్ మరియు రాయదుర్గం వైపు వెళ్లే ఇరువైపులా రైళ్లపై ప్రభావం పడింది. ఉదయం సమయం కావడంతో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్లాట్‌ఫారమ్‌లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. మెట్రో సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పనులను వేగవంతం చేశారు. లోపాన్ని సరిదిద్దిన తర్వాత కొద్దిసేపటి క్రితమే రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి.
ప్రస్తుతం మెట్రో సేవలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇలా తరచుగా సాంకేతిక సమస్యలు రావడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. సరైన సమయంలో ఆఫీసులకు వెళ్లలేకపోతున్నామని, మెట్రో నమ్మకాన్ని కోల్పోతోందని కొందరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
