Pawan Kalyan

Pawan Kalyan: నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకి సేవచేయడానికి ఛాన్స్ ఇచ్చింది సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (మార్చి 15) హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

సినిమా నాకు అన్నం పెట్టింది

వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపుని ఇచ్చింది సినిమానే. అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అనే లెక్కల కంటే, సినిమా బాగుందా లేదా అనేదే నాకు ముఖ్యం. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు.

మెగాస్టార్‌పై గౌరవం.. హరీష్ శంకర్ తపన

తన వ్యక్తిగత జీవితంలో ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి అని పవన్ స్పష్టం చేశారు. “ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే విషయం కూడా మర్చిపోతాను. ఈ సినిమా ట్రైలర్ చూసి అన్నయ్య చిరంజీవి గారు ట్వీట్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అన్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ గురించి చెబుతూ.. “హరీష్ మీలో ఒకడు. అభిమాని దర్శకుడైతే ఎలా ఉంటుందో హరీష్ అలా ఉంటాడు. తెలంగాణ నేల నుంచి వచ్చిన ఈ అద్భుత దర్శకుడు నన్ను కొత్తగా చూపించాలని ఎంతో తపన పడ్డాడు. కేవలం 40-45 రోజుల్లోనే నా రాజకీయ బాధ్యతలకు ఇబ్బంది కలగకుండా షూటింగ్ పూర్తి చేశాడు” అని ప్రశంసించారు.

టెక్నీషియన్లు మరియు నటీనటులకు ధన్యవాదాలు

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ విలువలను, సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్‌ల పనితీరును పవన్ కొనియాడారు. హీరోయిన్ శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ అని, ఈ సినిమా ఆమె కెరీర్‌లో గుర్తుండిపోతుందని చెప్పారు. అలాగే రాశీ ఖన్నా తనపై ఉన్న నమ్మకంతో కథ వినకుండానే సినిమాకు ఒప్పుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు.

అభిమానులే నా బలం

“అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. నాకు, మీకు మధ్య కేవలం రెండు గుండెల దూరమే ఉంది. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *