Jana Nayagan

Jana Nayagan: జన నాయగన్‌కు సెన్సార్ సెగ.. విజయ్ సినిమా మళ్లీ వాయిదా!

Jana Nayagan: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సినిమా విడుదలపై ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసుల వల్ల ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తుందని చిత్రబృందం భావించినప్పటికీ, అనూహ్యంగా మరో అడ్డంకి ఎదురైంది.

సెన్సార్ బోర్డు (CBFC) సూచించిన మార్పులన్నింటినీ పూర్తి చేసి, ఫైనల్ వెర్షన్‌ను చిత్ర యూనిట్ సిద్ధం చేసింది. ఈ సినిమాను సోమవారం రివైజ్ కమిటీ సభ్యులు చూడాల్సి ఉంది. అయితే, కమిటీలోని ఒక సభ్యుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ఈ స్క్రీనింగ్ చివరి నిమిషంలో రద్దయ్యింది. దీనివల్ల సెన్సార్ సర్టిఫికెట్ రావడం మరికొంత కాలం ఆలస్యం కానుంది. తదుపరి స్క్రీనింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.

నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 20నే విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ వివాదాలు సర్దుమణిగినా, సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. గడిచిన మూడు నెలలుగా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడుతూనే ఉండటం గమనార్హం. సెన్సార్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో, దానికి మూడు రోజుల ముందుగానే అంటే జూన్ 18న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ సజావుగా సాగితే, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *