AP liquor scam

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!

AP liquor scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక వ్యక్తులకు చెందిన దాదాపు రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు తాజాగా అటాచ్ చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ప్రకటించింది. జప్తు చేసిన ఆస్తుల్లో స్థిర ఆస్తులతో పాటు భారీ మొత్తంలో చరాస్తులు కూడా ఉన్నాయని సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మరియు చాణక్యలకు చెందిన ఆస్తులపై ఈడీ వేటు వేసింది. వీరు షెల్ కంపెనీలను సృష్టించి, తప్పుడు మార్గాల్లో దాదాపు రూ. 1,048 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ముఖ్యంగా 2019 తర్వాత రాష్ట్ర మద్యం విధానంలో జరిగిన మార్పులను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారని అధికారులు నిర్ధారించారు. పాత మద్యం బ్రాండ్లను కావాలనే మార్కెట్ నుండి తొలగించి, తమకు అనుకూలంగా ఉండే కొత్త కంపెనీలకు ఆర్డర్లు ఇస్తూ భారీగా ముడుపులు తీసుకున్నట్లు తేలింది.

మరోవైపు, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ (SIT) అధికారులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా ఆయనపై వందకు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్ము చివరకు ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.

ఈ భారీ కుంభకోణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు రూ. 4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ప్రతి మద్యం కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్ బ్యాక్ వసూలు చేశారని, కమిషన్లు ఇవ్వని కంపెనీలకు ఆర్డర్లు నిలిపివేసి వేధించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆస్తుల జప్తుతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *