Rashmika Vijay Wedding Look: ముగిసిన వేడుక – మెరిసిన జంట టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ఈ క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు, వీరి పెళ్లి ఫోటోలు పండగను తీసుకువచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ‘రాయల్ వెడ్డింగ్’ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి పెళ్లి దుస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచూశాయి.
సబ్యసాచి కాదు.. అనామిక ఖన్నా మ్యాజిక్!
సాధారణంగా సెలబ్రిటీలు తమ పెళ్లికి మనీష్ మల్హోత్రా లేదా సబ్యసాచి వంటి డిజైనర్లను ఎంచుకుంటారు. కానీ విజయ్, రష్మిక మాత్రం కొత్తగా ఉండాలని భావించి ప్రఖ్యాత డిజైనర్ అనామిక ఖన్నాను ఎంచుకున్నారు. మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అనామిక రూపొందించిన ఈ దుస్తులు, ఈ జంటను ఒకప్పటి రాజకుటుంబీకుల్లా మార్చేశాయి. ప్రముఖ స్టైలిస్ట్ అమీ పటేల్ ఆధ్వర్యంలో ఈ వేడుకకు సంబంధించిన ప్రతి లుక్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది.
మహారాణిలా మెరిసిన రష్మిక
రష్మిక తన పెళ్లి కోసం ఎరుపు మరియు బంగారు రంగు కలగలిసిన ‘సిందూరీ’ చీరను ధరించింది. ఈ చీరపై హైదరాబాద్ వారసత్వాన్ని గుర్తుకు తెచ్చేలా అందమైన దేవాలయాలు, పాతకాలపు ఇళ్ల నమూనాలను దంతపు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి తోడుగా ఆమె ధరించిన బంగారు టెంపుల్ జ్యువెలరీ, నడుము పట్టీ, వంకీలు ఆమెకు నిండుతనాన్ని ఇచ్చాయి. ఆ చిన్న ముక్కు పుడక రష్మిక అందాన్ని రెట్టింపు చేసి, ఆమెను ఒక అపురూపమైన మహారాణిలా చూపించింది.
రాజులా విజయ్ దేవరకొండ
విజయ్ కూడా తన ఆహార్యంతో అందరినీ కట్టిపడేశాడు. సంప్రదాయ ‘వనసింగారం’ నేతతో తయారు చేసిన దంతపు రంగు ధోవతి, దానికి జతగా ఎరుపు రంగు అంగవస్త్రాన్ని ఆయన ధరించారు. అంగవస్త్రంపై ఉన్న ఆలయ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడలో బంగారు హారాలు, చేతికి కడియాలు, చెవి పోగులు ధరించిన విజయ్.. అచ్చం ఒక రాజ్యానికి కాబోయే రాజులా కనిపించాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మళ్లీ మొదలైన బంగారు ఆభరణాల ట్రెండ్
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో డైమండ్స్, కుందన్ సెట్లకు ప్రాధాన్యత పెరిగింది. కానీ రష్మిక-విజయ్ పక్కా గోల్డ్ జ్యువెలరీలో మెరవడంతో, రాబోయే రోజుల్లో మళ్లీ బంగారు ఆభరణాల హవా పెరగడం ఖాయమని ఫ్యాషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ జంట తమ పెళ్లితో కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సృష్టించడమే కాకుండా, మన సంప్రదాయాలకు ఉన్న విలువను ప్రపంచానికి చాటిచెప్పారు.
View this post on Instagram
