Hrithik Roshan: బాలీవుడ్ ‘గ్రీక్ గాడ్’ గా పేరుపొందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ‘వార్-2’ సినిమా ఫలితం కేవలం ఎన్టీఆర్పైనే కాకుండా, హృతిక్ రోషన్ కెరీర్‌పై కూడా గట్టి ప్రభావం చూపింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వార్-2’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, సినిమాలోని గ్రాఫిక్స్ పైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
క్రిష్-4 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నిర్మాతలు!
‘వార్-2’ పరాజయం నుండి కోలుకోవడానికి హృతిక్ వెంటనే ‘క్రిష్-4’ (Krrish 4) సినిమా ప్రారంభించాలని భావించారు. అయితే, ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా ఉంటామని ముందుగా మాటిచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ డీల్స్ రేట్లు భారీగా తగ్గడంతో, ఈ సమయంలో ఇంత భారీ బడ్జెట్ సూపర్ హీరో సినిమా చేయడం రిస్క్ అని భావించిన నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
సౌత్ డైరెక్టర్లపైనే ఆశలు!
ప్రస్తుతానికి ‘క్రిష్-4’ ఆగిపోవడంతో హృతిక్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్లు అందుబాటులో లేరు. స్టార్ డైరెక్టర్లందరూ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి కోసం మరో రెండేళ్లు వేచి చూడటం కంటే, ఈ గ్యాప్‌లో సౌత్ డైరెక్టర్లతో ఒక పక్కా యాక్షన్ సినిమా చేయాలని హృతిక్ నిర్ణయించుకున్నారు.
గతంలో తనతో సినిమా చేస్తామని వచ్చిన సౌత్ ప్రొడ్యూసర్లను డేట్స్ లేవని తిప్పి పంపిన హృతిక్, ఇప్పుడు వారితోనే చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే సరైన డైరెక్టర్ కోసం నిర్మాతలు వేట మొదలుపెట్టారు. ఇప్పటికే హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి హృతిక్ అంగీకరించిన సంగతి తెలిసిందే. మరి హృతిక్ రోషన్‌ను డైరెక్ట్ చేసే ఆ సౌత్ డైరెక్టర్ ఎవరో చూడాలి.
