Anil Ravipudi: సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేశారు. అందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తున్నట్లు రివీల్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అనిల్ రావిపూడి పంచుకున్నారు.
వెంకటేష్‌తో ఎఫ్-2, ఎఫ్-3 వంటి మల్టీస్టారర్ సినిమాలు తీసిన అనిల్, వెంకటేష్ నుండి మళ్ళీ కామెడీ యాంగిల్ బయటకు తీసుకువచ్చి హిట్ కొట్టారు. ఆ తర్వాత సోలో సినిమాగా 2025 సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికీ వస్తున్నాం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అల్-టైమ్ రికార్డులు క్రియేట్ చేశారు. మొన్నటి 2026 సంక్రాంతికి కూడా చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇలా తనకు అచ్చొచ్చిన సంక్రాంతిని వదలని అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ సినిమా కోసం 2027 సంక్రాంతికి డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు.
తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్, అలాగే వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కూడా తన స్టైల్లోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన మార్క్ కామెడీతో పాటు భారీ స్థాయిలో యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని చెప్పారు.
ఇంతకుముందు అనిల్ రావిపూడి తీసిన పటాస్, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి వంటి సినిమాలలో స్టోరీతో పాటు యాక్షన్‌కు స్కోప్ ఎక్కువగా ఉంది. అవి బాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే సినిమాలోనూ వెంకటేష్‌తో కామెడీ చేయిస్తూనే, మరో పక్కన కళ్యాణ్ రామ్ పాత్రతో భారీ యాక్షన్ సన్నివేశాలు చేయించే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అవగానే వెంటనే ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారు. అనిల్ రావిపూడి షూటింగ్‌కు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకోరు కాబట్టి, సినిమాను త్వరగానే పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
