UK eVisa: మీరు లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బ్రిటన్ (UK) ప్రభుత్వం తన వీసా విధానంలో కీలక మార్పులు చేస్తూ బుధవారం నుండి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై పాత పద్ధతిలో పాస్‌పోర్ట్‌పై వీసా స్టిక్కర్లు ఉండవు. వీటన్నింటినీ డిజిటలైజ్ చేస్తూ ఈ-వీసా మరియు ఇటిఏ విధానాలను ప్రవేశపెట్టారు. భారతీయ ప్రయాణికులకు కూడా ఈ కొత్త నియమాలు వర్తిస్తాయి.
ఏమిటీ ఈ-వీసా (eVisa)?
ఇప్పటివరకు మనం బ్రిటన్ వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌పై వీసా స్టిక్కర్ వేయించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు తమ వీసా పత్రం పోతుందనే భయం ఉండదు, ఎవరూ దాన్ని దొంగిలించలేరు. అయితే, బయోమెట్రిక్ వివరాల కోసం దరఖాస్తుదారులు వెళ్లాల్సి ఉంటుంది కానీ, గతంలోలాగా ప్రాసెసింగ్ అయ్యే వరకు మీ పాస్‌పోర్ట్‌ను అక్కడ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు.
ముందే అనుమతి తీసుకోవడం తప్పనిసరి (ETA):
అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాల ప్రజలకు గతంలో బ్రిటన్ వెళ్లడానికి వీసా అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వారు కూడా ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) తీసుకోవడం తప్పనిసరి. దీని ధర దాదాపు 16 పౌండ్లు (సుమారు 1700 రూపాయలు) ఉంటుంది. ఇది రెండు సంవత్సరాల పాటు చెల్లుతుంది. దీని ద్వారా బ్రిటన్ తన సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేస్తోంది. ఇతర దేశాల విమానాల్లో కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా వెళ్లేవారు కూడా ఈ అనుమతి తీసుకోవాలి.
ప్రయాణానికి ముందే సిద్ధమవ్వండి:
ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ వల్ల విమానయాన సంస్థలకు మీ వీసా వివరాలు ఆన్లైన్లోనే కనిపిస్తాయి. ఒకవేళ మీ దగ్గర సరైన ఈ-వీసా లేదా ఈటీఏ లేకపోతే, మిమ్మల్ని విమానం ఎక్కనివ్వరు. కాబట్టి ప్రయాణానికి కనీసం మూడు రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బ్రిటన్ వెళ్లే ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడం ద్వారా ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు.
