Ambati Rambabu

Ambati Rambabu: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. ప్రాణాలు పోయినా పోరాటం ఆపను

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు తన నివాసంపై జరిగిన దాడి పట్ల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. తన ఇంటిపై దాడి కేవలం కొద్దిసేపు జరిగింది కాదని, సాయంత్రం 5 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే సుమారు 7 గంటల పాటు భీభత్సం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు.

ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై అంబటి తీవ్ర విమర్శలు చేశారు. దాడి జరుగుతున్న సమయంలో తాను స్వయంగా రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఫోన్ చేసినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే నేరస్థుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాడికి ముందు తన ఇంటి పరిసరాల్లో గంజాయి సరఫరా చేశారని అంబటి ఆరోపించారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్పీ సైతం.. “మాకు వేరే పనులు ఉండవా?” అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వెనుదిరగడం తనను ఎంతో బాధించిందని అన్నారు. పోలీసులు బాధితులకు కాకుండా దాడులు చేసే వారికే రక్షణగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు.

చివరగా, రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అవుతున్నాయని, ప్రజలందరూ ఈ పరిణామాలను గమనించాలని కోరారు. “ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. నా ప్రాణాలు పోయినా సరే పోరాటం చేస్తా” అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రతి తప్పుకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *