Komali Suicide

Komali Suicide: ఎదురుచూపులు మిగిల్చిన వేదన.. మరణం ముంగిట కోమలి రాసిన ఆఖరి మాటలు.

Komali Suicide: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అందమైన వీడియోలతో అందరినీ అలరించాల్సిన ఆ చిన్నారి, ప్రేమించిన వాడు మోసం చేశాడనే బాధతో తనువు చాలించింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూనే, పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలి, మణికొండలోని చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

ఈ విషాదానికి ప్రధాన కారణం అఖిల్ రెడ్డి అనే యువకుడితో ఆమె సాగించిన ప్రేమాయణమేనని తెలుస్తోంది. కోమలి అతడిని ప్రాణంగా ప్రేమించగా, అఖిల్ మాత్రం ఆమెను నమ్మించి వంచించినట్లు సమాచారం. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం సాగించిన అఖిల్, చివరికి కోమలిని దూరం పెట్టాడు. ఆత్మహత్యకు ఒకరోజు ముందు కూడా అఖిల్ ఆమె ఫ్లాట్‌కు వెళ్లి మాట్లాడగా, అక్కడ జరిగిన గొడవ కోమలిని మానసిక వేదనకు గురిచేసింది. తనను కాదని మరో అమ్మాయితో ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.

చనిపోయే ముందు కోమలి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేస్తోంది. అందులో ఆమె తన అంతర్మథనాన్ని చాలా బాధాకరంగా వ్యక్తం చేసింది. “నేను జీవితంలో ముందుకు వెళ్లలేకపోతున్నాను.. ఎందుకంటే అతను ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వస్తాడేమో అని నా ఆశ. అతను నన్ను వదిలేశాడని నాకు తెలుసు, నాతో ఉండడానికి ప్రయత్నించడం లేదని కూడా తెలుసు. కానీ నా మనసులో ఏదో ఒక మూల చిన్న ఆశ.. ఏదో ఒకరోజు అతను నన్నే కోరుకుంటాడని ఎదురు చూస్తోంది. నేను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాక, ఒకవేళ అతను నన్ను వెతుక్కుంటూ వస్తే ఏం చేయాలి? అందుకే ముందుకు వెళ్లడం అసాధ్యంగా అనిపిస్తోంది” అని ఆ లేఖలో పేర్కొంది.

ప్రస్తుతం నిందితుడు అఖిల్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు. కోమలి మెసేజ్ చేసినప్పుడు అఖిల్ అక్క ఆమె ఇంటికి వెళ్ళినా, తలుపు తీయకపోవడంతో తిరిగి వెళ్ళిపోయిందే తప్ప పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఒక చిన్న ఆశ, ఒక పెద్ద నమ్మకం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *