Badamgir Sai: ప్రముఖ నాటక రచయిత, రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు ఎ.వి.వి.ఎస్.మూర్తి (బాదంగీర్ సాయి) గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. విశాఖలో నివాసముండే ఆయన కొంతకాలంగా ట్రెయిన్ హ్యామెరెజ్ సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మురళీనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాటక కళాకారుడైన బాదంగీర్ సాయి నటనతో సరిపెట్టుకోకుండా నాటక వికాసానికి కూడా తన వంతు కృషి చేసేందుకు నిరంతరం తపిస్తూ నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. దేశ, విదేశాల్లో ప్రసిద్ధి గాంచిన సురభి నాటకాలను విశాఖలో 40 రోజులపాటు ప్రదర్శింపజేశారు. అదే విధంగా విశిష్ట ప్రేక్షకాదరణ పొందిన అనేక నాటకాలను విశాఖ నగరంలో ప్రదర్శింపజేస్తూ 2010లో ఏర్పాటు చేసిన రంగసాయి నాటక సంఘం సంస్థ ద్వారా కృషి చేశారు.
ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Badamgir Sai: తెలుగు నాటక రంగ దినోత్సవం, ప్రపంచ నాటక రంగ దినోత్సవాల సందర్భంగా ఏటా మరుగుపడిన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు, వారిని ఘనంగా సత్కరిస్తుంటారు. నాటకం అనేక సామాజిక వాస్తవాల విభిన్న దర్శణం. నేటికీ అధునాతన కళలకు చోదక శక్తిని అందించే రంగమని, అలాంటి నాటక సృజనను రానున్న తరాలకు అందివ్వాలని నాటక పుస్తకాల సేకరణ ప్రారంభించి, పది వేల కు పైగా నాటక గ్రంథాలతో ‘రంగసాయి నాటక గ్రంథాలయం’ ఏర్పాటు చేశారు. దేశంలోని తొలి నాటక గ్రంథాలయ ఆవిర్భావానికి కారణమైంది. తాను ప్రేమించే నాటక రచనలను నిక్షిప్తం చేసేందుకు ఏడు సంవత్సరాలు నాటక గ్రంథాలను నటులు, నాటక రచయితలు, సంస్థలను అర్థిస్తూ విలువైన సమాచారాన్ని సేకరించారు. అంతే కాదు, సేకరించిన ఆ నాటక గ్రంథాలను పదిలపరిచేందుకు దేశంలోనే ఏకైక నాటక గ్రంథాలయంగా మహా విశాఖ నగర పాలక సంస్థ శాశ్వత ప్రాతిపదికన రంగసాయి నాటక గ్రంథాలయం రూపుదిద్దింది. ఆయన మృతి చెందారని తెలుసుకున్న కళాకారులు, రచయితలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

