AP News: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో గజదొంగలు బీభత్సం సృష్టించారు. తిమ్మయ్య కాలనీలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఏకంగా 35 తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులను దోచుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం శనివారం నాడు పెనికలపాడులోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు, పక్కా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారు.
దొంగలు ముందుగా పగటిపూట ఆ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన విషయాన్ని నిర్ధారించుకున్నాక, రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచుకున్న విలువైన నగలను అపహరించడమే కాకుండా, ఇంట్లోని సామాన్లను చిందరవందరగా పడేశారు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసిన స్థానికులు వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే యజమాని బాలిరెడ్డి తన కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకున్నారు. బీరువాలోని నగలు మాయమైనట్లు గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ కొండారెడ్డి, ఎస్సై సంజీవరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో దొంగల వేలిముద్రలను సేకరించారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
