AP News: విశాఖపట్నంలో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని రెండేళ్ల పసికందుపై ఓ ఉన్మాది అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై విగతజీవిని చేశాడు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నమ్మించి ప్రాణం తీసిన మృగం
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన దిగ్భ్రాంతికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడి పేరు యోగి (19). అతను స్థానికంగా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. బాధితురాలి కుటుంబంతో నిందితుడికి ముందు నుండే పరిచయం ఉంది. ఈ చనువును అదునుగా చేసుకున్న నిందితుడు, చిన్నారిని నమ్మించి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడుతుందనే భయంతో ఆమెను హతమార్చాడు.
ప్రజా ఆగ్రహం
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పసిపాప అని కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి మరణశిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విశాఖలో మహిళలు, పిల్లలపై అరాచకాలు పెరుగుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
