Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా కేసులో చిక్కుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు ఊరట లభించింది. బుధవారం సాయంత్రం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించడంతో అంబటి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెలుపల పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి.
అసలేం జరిగింది?
సత్తెనపల్లి నియోజకవర్గంలో 2023 సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో అక్రమాలు జరిగాయని, పెన్షన్ దారుల నుంచి నగదు వసూలు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పొందిన అంబటిని, జైలు నుంచి విడుదల కావడానికి ముందే ఈ పాత కేసులో పీటీ వారెంట్‌పై పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. దాదాపు 18 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయనకు విముక్తి లభించింది.
జైలు నుంచి వస్తూనే ఘాటు వ్యాఖ్యలు
విడుదల అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు:
తనను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని, తన భార్య, పిల్లలను కూడా వేధించారని ఆరోపించారు.
“ఎన్ని రోజులైనా జైల్లో ఉండటానికి నేను సిద్ధపడే వెళ్లాను.. వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నా పోరాటం ఆగదు” అని శపథం చేశారు.
రాష్ట్రంలో బాధితులను జైల్లో పెట్టి, క్రిమినల్స్‌ను వదిలేస్తున్నారని.. ఈ అన్యాయానికి దేవుడే తగిన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
