Actress Prathyusha Case:

Actress Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు..సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలి..!

Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు నేడు (మంగళవారం, ఫిబ్రవరి 17, 2026) తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థిస్తూ, నిందితుడు నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

ఏమిటీ కేసు? అసలేం జరిగింది?

నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి ప్రవేశించి హీరోయిన్‌గా రాణిస్తుండగా, సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్‌లో చేరాడు. అయితే వీరి వివాహానికి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, మనస్తాపం చెందిన వీరిద్దరూ ఫిబ్రవరి 23, 2002న కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపై ఆమె తల్లి సరోజినీ దేవి అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు, ఆనాటి రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కేసు విచారణను సీబీఐకి అప్పగించారు.

సుదీర్ఘ న్యాయపోరాటం – కోర్టు తీర్పులు

  • సెషన్స్ కోర్టు (2004): నిందితుడు సిద్ధార్థ రెడ్డికి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (సెక్షన్ 306) ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది.
  • హైకోర్టు (2011): శిక్షను ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ. 50 వేలకు పెంచుతూ తీర్పునిచ్చింది.
  • సుప్రీంకోర్టు (2012-2026): హైకోర్టు శిక్ష తగ్గించడాన్ని సవాలు చేస్తూ ప్రత్యూష తల్లి, తన శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ముఖ్యాంశాలు

జస్టిస్ రాజేశ్ బిందల్ – జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర ఏడు రకాల సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం ఉన్న సిద్ధార్థ రెడ్డికి, లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *