Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వింతగా మారుతోంది. గత కొన్ని రోజులుగా చలి తగ్గిపోయిందని అనుకుంటున్న తరుణంలో, మళ్లీ తెల్లవారుజామున చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. అయితే పగటిపూట మాత్రం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు కీలక అప్డేట్స్ ఇచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం:
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచన ఏమీ లేదు. అయితే, తెల్లవారుజామున మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. వాహనదారులు ఉదయం వేళల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే ఐదు రోజుల వరకు పెద్దగా మార్పులు ఉండబోవని, సాధారణ స్థాయిలోనే నమోదవుతాయని స్పష్టం చేశారు.
తెలంగాణ వాతావరణం:
తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆగ్నేయ, తూర్పు దిశల నుండి గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో తెలంగాణ అంతటా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం చలి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మొత్తానికి చూస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ప్రస్తుతం మిశ్రమ వాతావరణం ఉంది. పగలు ఎండకు చెమటలు పడుతుంటే, తెల్లవారుజామున మాత్రం దుప్పట్లు కప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
