Ganta Srinivasa Rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, వైసీపీ డీఎన్ఏలోనే సంస్కారహీనత ఉందని మండిపడ్డారు. సభ్యసమాజం తలవంచుకునేలా వ్యవహరిస్తున్న ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు గంటా వెల్లడించారు.
నాయకుడు ఏ విధంగా ఉంటే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారన్న దానికి వైసీపీ నిదర్శనమని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వైఎస్ భారతి గారిపై ఎవరైనా మాట్లాడితే కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను అరెస్టు చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని గుర్తు చేశారు. తప్పు ఎవరు చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ నేతలు చేస్తున్న అసభ్య వ్యాఖ్యలను సమర్థిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జగన్ కూడా గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా, వివాదాస్పదంగా మాట్లాడేవారని, అదే సంస్కృతి ఇప్పుడు ఇతర నేతలకు పాకిందని గంటా ధ్వజమెత్తారు.
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్: 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిని, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోందని ఆయన హెచ్చరించారు. గతంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పొరపాట్లు జరిగితే క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉండేవని, కానీ నేటి వైసీపీ నేతలకు ఆ కనీస గౌరవం లేదని విమర్శించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే కులాల ప్రస్తావన తెస్తూ రాజకీయాలు చేస్తున్నారని, భవిష్యత్ తరాలు ఆందోళన చెందేలా ఉన్న ఈ మురికి రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
