Cigarette Price Hike: పొగ తాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలను భారీగా పెంచుతూ కొత్త పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చింది. సామాన్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పొగాకు వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఈ పెంపు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేలా ఉండటంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఎలా పెరగనున్నాయి అంటే?
ఇప్పటివరకు ఈ ఉత్పత్తులపై కేవలం 28 శాతం జీఎస్టీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పాత పద్ధతిని మారుస్తూ, జీఎస్టీతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీని కూడా ప్రభుత్వం చేర్చింది. సిగరెట్ పొడవు, అది ఫిల్టర్ ఉన్నదా లేదా అనే అంశాలను బట్టి ఈ పన్నులు వేర్వేరుగా ఉంటాయి. చిన్న సిగరెట్లపై ఒక్కో స్టిక్కు సుమారు రూ. 2.05 నుండి, పొడవైన సిగరెట్లపై రూ. 5.40 వరకు అదనపు భారం పడనుంది.
రూ. 18 సిగరెట్.. రూ. 72 అవుతుందా?
ప్రస్తుతం మార్కెట్లో ఒక సిగరెట్ ధర సుమారు రూ. 18 వరకు ఉంది. కానీ తాజా పన్నుల ప్రభావంతో, భవిష్యత్తులో దీని ధర రూ. 70 నుండి రూ. 72 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు నాలుగు రెట్లు ధర పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ-సిగరెట్లు మరియు నికోటిన్ ఉత్పత్తులపై అయితే ఏకంగా 100 శాతం పన్ను విధించడం గమనార్హం.
పాన్ మసాలా, గుట్కాలపై ప్రత్యేక సెస్
కేవలం సిగరెట్లు మాత్రమే కాదు, పాన్ మసాలా మరియు గుట్కా ప్రియులకు కూడా చేదు వార్తే. వీటిపై ఆరోగ్య మరియు జాతీయ భద్రతపేరుతో కొత్తగా సెస్‌ను విధించారు. ముడి పొగాకుపై కూడా 60 నుండి 70 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో, పొగాకు సంబంధిత అన్ని వస్తువుల ధరలు చుక్కలను తాకనున్నాయి.
నిపుణుల ఆందోళన ఇదే..
ధరలు పెంచడం వల్ల ప్రజలు పొగ తాగడం మానేస్తారని ప్రభుత్వం ఆశిస్తుంటే, నిపుణులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. పన్నులు మరీ ఎక్కువగా ఉంటే, ప్రజలు చట్టబద్ధమైన కంపెనీల సిగరెట్లను వదిలేసి.. తక్కువ ధరకు దొరికే అక్రమ సిగరెట్ల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా, నాణ్యత లేని పొగాకు వల్ల ప్రజల ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
