KCR

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్!

KCR: తెలంగాణ రాజకీయాల్లో నేడు అత్యంత కీలకమైన రోజుగా మారబోతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించేందుకు సిట్ (SIT) అధికారులు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలోనే ఈ విచారణ జరగనుంది.

విచారణ ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉన్న ఆయన, ఉదయం 9 గంటల తర్వాత అక్కడి నుండి బయలుదేరి 11 గంటల కల్లా తన నంది నగర్ నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ ఇంటి వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.

మరోవైపు, ఈ విచారణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసనలు తెలపాలని, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఈ విచారణ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర కీలక నేతలంతా తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని సూచించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *