శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నెయ్యి కల్తీపై క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిట్ (SIT) ఛార్జ్షీట్లోనే కల్తీ జరిగినట్లు స్పష్టంగా నమోదయ్యిందని, వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని చైర్మన్ ఆరోపించారు. కొందరికి వ్యక్తిగత లాభం చేకూర్చేలా నిబంధనలను మార్చి, సరైన సామర్థ్యం లేని సంస్థలకు టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు రూ. 250 కోట్ల వ్యయంతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారని, ఆ నెయ్యిని పరీక్షించిన NDDB అందులో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు.
కనీసం ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేని సంస్థలు నెయ్యి సరఫరా చేశామని చెప్పడం పచ్చి అబద్ధమని బీఆర్ నాయుడు విమర్శించారు. నెయ్యి తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని, కేవలం కమిషన్ల కోసమే కొన్ని డైరీలను ఎంపిక చేశారని ఆయన ధ్వజమెత్తారు.
గత ఐదేళ్లలో హిందూ దేవుళ్లను, హిందూ సమాజాన్ని హేళన చేస్తూ నాశనం చేయడానికి కొందరు ప్రయత్నించారని, వారంతా భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నెయ్యి నాణ్యతపై పూర్తి నిజాలు నిగ్గుతేలాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమంది బినామీల ఖాతాల్లోకి చేరిన కోట్ల రూపాయల లావాదేవీలపై సిట్ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు పెద్దలను బయటపెట్టాలని ఆయన కోరారు.
