GHMC Council: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన భారీ బడ్జెట్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ శనివారం నాడు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత పాలక వర్గ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో, మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ చివరి కౌన్సిల్ సమావేశం ఆద్యంతం చర్చలు, రాజకీయ విమర్శలు, భావోద్వేగాల మధ్య సాగింది.
మొత్తం రూ. 11,460 కోట్ల భారీ అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్లో నగర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ఇందులో పాత జీహెచ్ఎంసీ పరిధిలోని పనులకు రూ. 9,200 కోట్లు కేటాయించగా, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల ప్రగతి కోసం మరో రూ. 2,260 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ల అభివృద్ధి కోసం రూ. 1,720 కోట్లు, వర్షాకాలంలో ముంపు సమస్యను నివారించేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ (SNDP) కింద రూ. 550 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు పారిశుధ్యం, పచ్చదనం పెంపునకు కూడా గణనీయమైన నిధులను కేటాయించారు. ఈ నిధులను ప్రధానంగా ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ ఫీజులు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా సమీకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: Amit Shah: మమతా ప్రభుత్వంపై అమిత్ షా ఫైర్
అయితే సమావేశం ప్రారంభంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం ముదరడంతో మేయర్ జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేశారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సాగి, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
చివరి సమావేశం కావడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సభలో భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్ల పాటు హైదరాబాద్ ప్రథమ పౌరురాలిగా సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని, అధికారుల సహకారంతో నగరాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. పదవీకాలం ముగిసినా నగర ప్రజల పట్ల తన బాధ్యతను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆమోదంతో నగరంలో రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయి.
