Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను కొద్దిరోజులుగా కలవరపెడుతున్న వార్తలపై ఆయన పీఆర్ టీమ్ స్పష్టతనిచ్చింది. మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారని, దీనిని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని వారు కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ప్రభాస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు.
ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఫలితం పట్ల అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్, దర్శకుడు మారుతిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా.. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటి అడ్రస్‌కు పెద్ద ఎత్తున పార్శిళ్లను ఆర్డర్ చేసి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. ఇటువంటి సమయంలో మళ్లీ అదే కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Also Read: The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆలస్యంతో నాని ప్లాన్స్ తలకిందులు!
ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు రాబోయే 14 నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజా ప్రకటనతో మారుతితో మరో సినిమా అనే ప్రచారానికి పూర్తిగా చెక్ పడినట్లయింది.
