Epstein Case: అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పలు లైంగిక నేరాలకు పాల్పడి, జైలు శిక్ష అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్కు సంబంధించిన సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఈ దస్త్రాలలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పై ఎప్స్టీన్ చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎప్స్టీన్ తన ఈమెయిల్స్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, బిల్ గేట్స్ గతంలో రష్యా యువతులతో సన్నిహితంగా ఉండటం వల్ల లైంగిక వ్యాధి (STD) బారిన పడ్డారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు, అప్పట్లో తన భార్యగా ఉన్న మెలిండా గేట్స్‌కు తెలియకుండా ఆమెకు ఇవ్వడం కోసం ఎప్స్టీన్ను యాంటీబయాటిక్స్ అడిగినట్లు ఆ ఫైల్స్ పేర్కొంటున్నాయి. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి స్నేహానికి బిల్ గేట్స్ ఫుల్ స్టాప్ పెట్టడంతో, ఆగ్రహానికి గురైన ఎప్స్టీన్ ఆ కక్షతోనే ఈ వివరాలను తన డ్రాఫ్ట్ మెయిల్స్‌లో రాసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ప్రతినిధి బృందం తీవ్రంగా ఖండించింది. ఎప్స్టీన్ తనతో సంబంధాలు తెగిపోయాయన్న నిరాశతో గేట్స్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లారని వారు స్పష్టం చేశారు.
Also Read: Sunetra: డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం!
కేవలం బిల్ గేట్స్ మాత్రమే కాకుండా, ఈ ఫైల్స్‌లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, బ్రిటన్ రాజకుటుంబీకుడు ప్రిన్స్ ఆండ్రూ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. యూఎస్ వర్జిన్ దీవుల్లోని తన సొంత ద్వీపానికి రావాలని ఎప్స్టీన్ పలుమార్లు మస్క్‌ను ఆహ్వానించగా, ఆయన ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే, 2010లో ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా ఎప్స్టీన్ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో విందుకు ఆహ్వానించినట్లు ఆధారాలు లభించాయి.
అమెరికా న్యాయశాఖ ఈ భారీ డేటాను విడుదల చేస్తూ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. ఈ డాక్యుమెంట్లలో ఎవరి పేరైనా ఉన్నంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదని, అలాగే ఎప్స్టీన్ సాగించిన అరాచకాలు అందరికీ తెలుసని భావించలేమని పేర్కొంది. బిల్ గేట్స్, మెలిండా విడాకులకు కూడా ఎప్స్టీన్తో గేట్స్‌కు ఉన్న పరిచయమే ఒక కారణమని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో, తాజా ఫైల్స్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ డాక్యుమెంట్లలో ఇప్పటివరకు బయటకు రాని కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నట్లు సమాచారం.
