Sabarimala

Sabarimala: శబరిమల బంగారం చోరీ.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్‌..!

Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అరెస్టులతో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో తాజాగా ప్రముఖ నటుడు జయరామ్ పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చెన్నైలోని జయరామ్ నివాసానికి వెళ్లి ఆయనను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ విచారణకు కారణం 2019లో చెన్నైలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆ పూజను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి నిర్వహించగా, అందులో జయరామ్ పాల్గొన్న వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ కార్యక్రమంలో శబరిమల ఆలయానికి చెందిన ద్వారపాలకుల విగ్రహాల బంగారు కవచాలను మరమ్మతుల కోసం చెన్నైకి తీసుకొచ్చిన సమయంలో వాటిని అక్కడ ఉంచి పూజలు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇదే కోణంలో జయరామ్‌ను విచారించినట్లు సమాచారం.

Also Read:  Indigo: ఢిల్లీ విమానాన్ని హైజాక్ చేస్తాం..

సిట్ అధికారులు జయరామ్‌ను ఉన్నికృష్ణన్ పొట్టితో ఉన్న పరిచయం గురించి, అతనితో కలిసి ఎన్ని సార్లు పూజల్లో పాల్గొన్నారు, ఆ సమయంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయా అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే, ఆ పూజల సమయంలో ఉపయోగించిన వస్తువులు ఏవైనా శబరిమల ఆలయానికి సంబంధించినవేనా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు. ఈ విచారణ మొత్తం చెన్నైలోని జయరామ్ ఇంట్లోనే ప్రశాంతంగా జరిగినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా జయరామ్ మీడియాతో మాట్లాడుతూ, తాను కేవలం భక్తితోనే ఆ పూజకు హాజరయ్యానని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో మాత్రమే వెళ్లానని, బంగారం మాయమైన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సిట్ కూడా ఈ కేసులో జయరామ్‌ను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించి ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల వద్ద ఉన్న బంగారం ఎక్కడికి మాయమైంది అనే రెండు ప్రధాన అంశాలపై సిట్ దృష్టి పెట్టింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. వారిలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు బి. మురళీబాబు, ఎస్. శ్రీకుమార్ కూడా ఉన్నారు. అయితే నిర్ణీత గడువులో చార్జిషీట్ దాఖలు కాకపోవడంతో వారికి చట్టపరమైన బెయిల్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *