YS Sharmila

YS Sharmila: జగన్ పాదయాత్ర కేవలం అధికారం కోసమే: వైఎస్ షర్మిల వ్యాఖ్యలు

YS Sharmila: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న ఈ యాత్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదని, కేవలం కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి పన్నుతున్న రాజకీయ ఎత్తుగడ అని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్యాలెస్‌కే పరిమితమై, సొంత పార్టీ నాయకులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని వ్యక్తికి ఇప్పుడు హఠాత్తుగా ప్రజలు ఎందుకు గుర్తుకొస్తున్నారని ఆమె నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయని జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జనం ముందుకు వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Vijayanagaam: హోంగార్డు ఆస్తులు 20 కోట్లు…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ గాలికొదిలేశారని విమర్శిస్తూ, జలయజ్ఞం పేరుతో వైఎస్ఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను జగన్ తుంగలో తొక్కారని, ముఖ్యంగా సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. మద్యం రద్దుకు బదులు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా, నకిలీ మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని రిషికొండ సహజత్వాన్ని దెబ్బతీసి, అక్కడ అక్రమ కట్టడాల కోసం కొండను పిండి చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
పాలనలో ఉన్నప్పుడు ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ యాత్రల పేరుతో రావడం సరికాదని షర్మిల హితవు పలికారు. ప్రజలకు అవసరమైనప్పుడు అందుబాటులో లేని నాయకుడిని జనం నమ్మే స్థితిలో లేరని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *