KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజకీయ కుట్రతో ఈ నోటీసులు ఇస్తోందని, అసలు ఇది విచారణే కాదని, కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడమేనని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నో పథకాలతో తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడిని ఇలా ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు ఇలాంటి నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజల నోట్లో మట్టి కొట్టిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఇలాంటి నోటీసులకు, బెదిరింపులకు ఆయన భయపడబోరని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడి ఈ అన్యాయమైన పాలనపై తాము పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
